23, ఫిబ్రవరి 2017, గురువారం

జయలలిత... ఓ దిగ్విజయ కథానాయకి

జయలలిత... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి లక్షల మందికి 'అమ్మ' అయ్యారు. ఒక ప్రఖ్యాత పార్టీకి అధినేతగా...  ఒంటి చేత్తో మహామహులను మట్టి కరిపించి, యోధుల్లాంటి పార్టీ నాయకులతో పాదపూజ చేయించుకున్న 'పురుచ్చి తలైవి' ఆమె. ప్రత్యర్థులకు సింహ స్వప్నం, మన అనుకున్న వారికి మమతలు పంచే అమ్మదనం. ఈ రోజు జయలలిత జయంతి రోజు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వచ్చిన తొలి జయంతి. అమ్మను పోగొట్టుకున్న బాధ తాలూకు కంట తడి ఆరకముందే, తమిళులందరూ ఆమెను పునః స్మరించుకోవలిసిన సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా జయలలిత స్మృతికి నివాళులు అర్పిస్తోంది 'అభినయ సౌందర్యం'. 

జయలలిత ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. లేదా ఒక సినీ నటి మాత్రమే కాదు. అడుగడుగునా సమస్యలతో పోరాడుతూ, ప్రత్యర్థులతో తలపడుతూ పురుషాహంకార సమాజాన్ని ఎదిరించి, అదే అహంకారాన్ని పాదాక్రాంతం చేసుకున్న ధీర వనితా యోధురాలు జయలలిత. అయినప్పటికీ మన బ్లాగుకు సంబంధించి ఆమెను ఒక నటిగానే చూద్దాం. 

తల్లి సంధ్యతో జయలలిత 
జయలలిత అసలు పేరు కోమలవెల్లి (అమ్మమ్మ పేరు). ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మాండ్య జిల్లాలో మేల్కొటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించింది కోమలవెల్లి. అయ్యంగార్లుగా పిలువబడే తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోమలవెల్లికి రెండు సంవత్సరాల వయసులోనే తండ్రి జయరామ్ దూరమయ్యారు. దీంతో తల్లి వేదవల్లి మద్రాసుకు వచ్చేసి అప్పటికే సినిమాల్లో నటిస్తున్న తన చెల్లెలు విద్యావతి (అసలుపేరు అంబుజ వల్లి)తో కలిసి తానూ నటించడం మొదలుపెట్టింది. సంధ్య పేరుతో ప్రసిద్ధి పొందింది. కోమలవెల్లిని స్కూల్లో చేర్చేటప్పుడు ఆమె పేరును జయలలితగా మార్చారు. పిన్ని వద్దే బెంగళూరులో ఉంటూ తన తల్లిని కేవలం వేసవి సెలవుల్లోనే చూసేది జయలలిత. ఆ తర్వాత కొన్నాళ్ళకు పిన్నికి వివాహం కావడంతో తాను కూడా మద్రాసు వచ్చేసి అమ్మ సంధ్యతో పాటు ఉండేది. 
పువ్వు పుట్టగానే వికసిస్తుందన్న నానుడి జయలలితకు చక్కగా వర్తిస్తుంది. జయలలిత నాలుగేండ్ల వయసులోనే కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. దాంతో పాటు వెస్ట్రన్‌ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. వీటితోపాటు భరతనాట్యం, మోహినీ ఆట్టం, కథక్‌, మణిపురి వంటి నాట్యరూపాల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1960లో మైలాపూర్‌లో జరిగిన ఓ సభలో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ సభకు నటుడు శివాజీగణేషన్‌ రావడం ఓ విశేషమైతే, జయలలిత నృత్య ప్రదర్శన చూసి భవిష్యత్‌లో పెద్ద నటి అవుతావని ప్రశంసించటం మరో విశేషం.  

అమ్మ సంధ్యతోపాటు రోజూ షూటింగ్స్‌కి వెళ్తున్న క్రమంలో ఓ రోజు మరో చైల్డ్ ఆర్టిస్ట్‌ రాకపోవడంతో జయలలితకు అవకాశం వచ్చింది. అలా 1961లో 'శ్రీశైల మహత్యం' అనే కన్నడ సినిమాలో పార్వతీదేవిగా తొలిసారి వెండితెరపై కనిపించారు. చదువులో రాణిస్తున్న జయలలితను సినీరంగానికి తేవడం ఆమె తల్లికి ఇష్టం లేదు. అయితే ఒకప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి తనయుడు శంకర్ గిరి అడగడంతో 'ది ఎపిస్టైల్‌' అనే ఆంగ్ల సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. అదికూడా ఆదివారాల్లో షూటింగ్ పెట్టుకునే ఒప్పందంతో. జయ బాగా చదువుకుని పైకి రావాలని తల్లిగా సంధ్య ఆశపడ్డారు. జయకు కూడా లాయర్ కావాలని ఉండేది. కానీ విధి మరోలా రాసింది. 

హీరోయిన్ గా కన్నడ చిత్రం: 

సంధ్య నటించిన 'కర్ణన్' తమిళ చిత్రం తాలూకు ఒక కార్యక్రమంలో తల్లితో పాటు వచ్చిన జయను చూశాడు ప్రముఖ దర్శక నిర్మాత బిఆర్ పంతులు. అప్పుడాయన 'చిన్నాడ గొంబె' అనే కన్నడ సినిమాకు కథానాయిక కోసం వెదుకుతున్నాడు. వెంటనే సంధ్య దగ్గరికి వెళ్ళి జయ గురించి అడిగారు. సంధ్య మొహమాట పడింది. చదువుకు ఏ మాత్రం భంగం కలగకుండా కేవలం రెండునెలల్లోనే షూటింగ్ ముగించాలని షరతు పెట్టింది. అప్పుడు పియుసి చదువుతున్నారు జయ. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కథానాయికగా తన తొలి చిత్రానికి జయ అందుకున్న పారితోషికం రూ.3,000లు. 

తమిళ, తెలుగు రంగాల్లో ప్రవేశం: 

తల్లిచాటు బిడ్డగా జయ 
తొలి చిత్రం విజయవంతం కావడం, అదే సమయంలో తల్లి సంధ్యకు అవకాశాలు తగ్గి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత తన మీద పడటంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది జయ. 1965లో 'వెన్నిరా ఆడై' అనే చిత్రంతో అటు తమిళ రంగానికి, 'మనుషులు -మమతలు' చిత్రంతో ఇటు తెలుగు సినీ రంగానికి ఒకేసారి పరిచయమయ్యారు జయ. ఈ రెండు చిత్రాలు కూడా విజయవంతం కావడంతో జయ పేరు పరిశ్రమలో మారుమ్రోగి పోయింది. పదహారేళ్ళకే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు జయలలిత. 1966లో జయ నటించిన 11 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కురిపించాయి. దాంతో 1967లో పోయస్ గార్డెన్ లో ఉన్న 'వేద నిలయం' భవనాన్ని లక్షా 32 వేలకు కొన్నారు జయ. తన తల్లి పేరును పెట్టుకున్న 'వేద నిలయం' అంటే ఆమెకు ఎంతో ఇష్టం. 

హిందీ చిత్రం 'ఇజ్జత్':  

హిందీ చిత్రంలో ఓ స్టిల్ 
జయలలిత హిందీలో మాత్రం ఒకే ఒక్క సినిమా చేశారు. తెలుగు - తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన అలనాటి మేటి దర్శకుడు టి.ప్రకాశరావు దర్శకత్వంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర నటించిన 'ఇజ్జత్‌' సినిమాలో జయలలిత నటించారు.  ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా అందులో నటించిన జయలలితకు నటిగా మంచి పేరు వచ్చింది. 1973లో 'జీసెస్‌' చిత్రంతో జయ మాలీవుడ్‌లోకి అడుగిడారు. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో అతి తక్కువ కాలంలోనే జయ మాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తొలి గ్లామర్ హీరోయిన్:  

తెలుగు చిత్రం 'మనుషులు మమతలు'లో జయ 
హీరోయిన్‌లు నిండుగా చీరలో మాత్రమే కనిపించే ఆ కాలంలో జయ చొరవ చూపి స్కర్ట్స్‌, షార్ట్‌ స్లీవ్స్‌, టైట్‌ పాంట్స్‌తో నటించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. హీరోయిన్ కు స్విమ్ సూట్ కూడా ఆమే తొడిగారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఏర్పర్చుకున్నారు. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 140 సినిమాల్లో నటించగా, వాటిల్లో 119 సినిమాలు విజయం సాధించడం విశేషం.

ఎమ్జీఆర్‌తో జోడీ: 

'ఆయిరత్తిల్ ఒరువన్' నుండి ఓ స్టిల్  
1965-1973 కాలంలో ఎమ్జీఆర్‌తో కలిసి జయ ఎక్కువ సినిమాల్లో నటించింది. 'ఆయిరత్తిల్‌ ఒరవన్‌' చిత్రం ఎమ్జీఆర్‌తో కలిసి నటించిన తొలి చిత్రం. ఇది అద్భుత విజయాన్ని సాధించింది. ఆయనతో నటించిన చివరి చిత్రం 'పట్టికాట్టు పొన్నయ్య'. ఈ చిత్రం 1973లో తెరపైకి వచ్చింది. ఎమ్జీఆర్‌తో కలిసి నటించిన 28 సినిమాలూ బాక్సాఫీస్‌ హిట్స్‌ అవ్వడం విశేషం. ఆయనే జయకు రాజకీయ విద్య నేర్పించారు. ఎమ్జీఆర్‌ ను జయలలిత గురువుగా భావించారు. 'ఆయిరతిల్‌ ఒరువన్‌' చిత్రాన్ని ఎన్నికల సమయంలో డిజిటలైజేషన్‌ చేసి విడుదల చేయగా, ఇది తమిళనాట సంచలనం సృష్టించింది. జయ గెలుపులో ఈ సినిమా కీలక పాత్ర పోషించిందని అంటారు. వారిద్దరి జోడీకి తమిళనాట అంత ఆదరణ ఉండబట్టే జయను ఎమ్జీఆర్‌ రాజకీయ వారసురాలిగా అంగీకరించాయి తమిళ రాజకీయాలు.  

జయ తెలుగు చిత్రాలు:  

తమిళంలో ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎస్‌ఎస్‌. రాజేంద్రన్, జయశంకర్, ఏవీఎం.రాజన్, ముత్తురామన్, శివకుమార్ వంటి నటులందరితో నటించిన జయ తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులతోనూ చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌, జయలలిత నటించిన 'కదలడు వదలడు' చిత్రంలో అప్పట్లో భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్‌తో కలిసి దాదాపు 12 చిత్రాల్లో ఆమె నటించారు. 'గోపాలుడు-భూపాలుడు', 'చిక్కడు-దొరకడు', 'తిక్క శంకరయ్య', 'నిలువు దోపిడి', 'బాగ్దాద్‌ గజదొంగ', 'కథానాయకుడు', 'కదలడు- వదలడు', 'గండికోట రహస్యం', 'ఆలీబాబా 40 దొంగలు', 'శ్రీ కృష్ణ విజయం', 'శ్రీ కృష్ణ సత్య', 'దేవుడు చేసిన మనుషులు' వంటి తదితర చిత్రాలతో ఎన్టీఆర్‌, జయలలిత హిట్‌ పెయిర్‌గా నిలిచారు. వీటిల్లో చాలా చిత్రాలు సిల్వర్‌జూబ్లీలు ఆడాయంటే అతిశయోక్తి లేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఏడు చిత్రాల్లో నటించారు. 'మనుషులు-మమతలు', 'ఆస్తిపరులు', 'బ్రహ్మచారి', 'ఆదర్శ కుటుంబం', 'అదృష్టవంతులు', 'భార్యాబిడ్డలు', 'నాయకుడు వినాయకుడు' వంటి తదితర చిత్రాలతో ఈ జోడీ సైతం హిట్‌ పెయిర్‌ అయిపించుకుంది. ఇక శోభన్ బాబుతో 'డాక్టర్ బాబు', కృష్ణతో 'గూఢచారి 116', కాంతారావుతో 'చిక్కడు -దొరకడు' చిత్రాల్లో నటించారు. వాటిని నిత్యం స్మరించుకునేలా ఎన్నో మధురగీతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.  ‘మొక్క జొన్న తోటలో మురిసిన సీకట్లలో..’, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’, ‘ఆకులు పోకలు ఇవ్వొద్దు.. నా నోరు ఎర్రగ చేయొద్దు..’, ‘నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..’, ‘విరిసే కన్నులలో వేయి భాషలున్నవిలే..’, ‘ముత్యాల జల్లు కురిసే..’, ‘వినవయ్యా రామయ్యా..’, ‘బిడియమేల ఓ చెలి..’, ‘పగటిపూట చంద్రబింబం..’  వంటి ఎన్నో మధురగీతాలలో తన అభినయం, సౌందర్యంతో ఆ పాటలకు వన్నె తీసుకొచ్చారు. తెలుగు ప్రేక్షకుల మదిలో అందాల తారగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

గాయనిగా జయలలిత: 

జయ మంచి గాయని అన్న విషయం చాలామందికి తెలియదు. చిన్నప్పుడే సంగీతాన్ని నేర్చుకున్న జయ గాత్రం బాగుండటంతో నిర్మాతలు ఆమెతో పాటలు పాడించారు. ఎన్టీఆర్‌తో నటించిన 'అలీబాబా 40 దొంగలు' చిత్రంలో 'చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె' అనే పాట పాడారు.  'అమ్మ ఎండ్రాల్‌ అన్బు..'(అదిమై పెన్న్‌), 'ఓ మేరి దిల్‌రుబ..'(సూర్యకాంతి), 'నాన్‌ ఎండ్రాల్‌ అదు..'(సూర్యకాంతి), 'కాంగలిల్‌ ఆయిరామ్‌..'(వందలె మగరాసి)వంటి తమిళ పాటలు పాడి గాయనిగా కూడా పాపులర్‌ అయ్యారు. దీంతోపాటు భక్తి గీతాలు, ఇతర ఆల్బమ్స్‌లో కూడా జయలలిత పాటలు పాడడం విశేషం. కె.వి. మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, కున్నకుడి వైద్యనాధన్‌ వంటి సంగీత దర్శకుల సారథ్యంలోనే ఎక్కువ పాటలు పాడారు. ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మూడు పాటలు పాడారు. 

'కళైమామణి' జయ:  

ఐదుసార్లు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్‌ అవార్డులు అందుకున్నారు జయ. 1971లో తంగగోపురం, 72లో రామన్‌తేడియసీతై, 73లో సూర్యకాంతి, 74లో తిరుమాంగల్యం, 75లోయారుక్కుం వెక్కమ్‌ ఇల్లై చిత్రాలకు వరుసగా తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డుల పురష్కారాన్ని అందుకున్న అరుదైన నటి జయలలిత.  అదేవిధంగా 1972లో తమిళనాడు ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం 'కలైమామణి' అవార్డు జయలలితను వరించింది. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. 

ఇతర విషయాలు:  




  • జయ జీవితంలో ఆమె ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదనే చెప్పాలి. ఆమె బాగా చదివి న్యాయవాది కావాలని ఆశించారు. తన ప్రమేయం లేకుండానే 16వ ఏట సినీ రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇంకా విచిత్రంగా రాజకీయాల్లోకి కూడా అనుకోకుండానే వచ్చేశారు. తరువాత అదే జీవితంగా మార్చుకోవాల్సి వచ్చింది. 
  • అమెకు క్రికెట్‌ అన్నా, మేటి క్రికెటర్‌ పటౌడీ అన్నా వీరాభిమానం. అమెరికన్‌ నటుడు రాక్‌ హడ్సన్‌ అన్నా కూడా. వారిద్దరి బొమ్మలను చిన్నప్పుడు జయలలిత చాలా సేకరించారట. 
  • చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జయలలితపై దాదాపు 16 కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడిచాయి. 
  • జయలలితకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. అందులోనూ పురాణగాథలంటే మరీ ఇష్టం. ఆంగ్లంలోనూ, తమిళంలోనే కాకుండా ఇతర భాషల పుస్తకాలు కూడా ఆంగ్ల అనువాదాలు తెప్పించుకుని చదివేవారామె. సినీ నటిగా ఉన్నప్పటినుంచీ ఆమెకు ప్రయాణాల్లో, విదేశీ పర్యటనలకి వెళ్లేటప్పుడు పుస్తకాలు వెంట తీసుకెళ్లడం అలవాటు. చదవడమే కాదు, జీవితంలో వివిధ సందర్భాల్లో తాను చదివినవి గుర్తు చేసుకుంటూ ఉండేవారు. 
  • అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది.  ఏటా జనవరి నెలలో భాగ్యనగరానికి వస్తుండేవారు. మారేడ్‌పల్లిలో ఆమెకు సమీప బంధువులు ఉన్నారంట. 
  • 1965కు ముందు పలు తెలుగు చలనచిత్రాల్లో నటించడానికి నగర శివారు ప్రాంతమైన జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాలకు వచ్చేవారు. ఆ సమయంలోనే జీడిమెట్లలో నాలుగెకరాలు, పేట్‌బషీరాబాద్‌లో ఏడెకరాలు కొనుగోలు చేసి జె.జె.గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహారీగోడ నిర్మించారు. 
  • జయలలిత సినీరంగంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు శ్రీనగర్‌కాలనీలో ఒక ఇల్లు కొన్నారు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇక్కడకు వచ్చిన సందర్భాల్లో తనసొంతింట్లో ఉండేవారు. తర్వాత రాజకీయాల్లో చేరడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడకు రావడం మానేశారు.
  • జయ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు సభలో జయ ప్రసంగానికి నాటి నాయకురాలు ఇందిరాగాంధీ ముగ్దులయ్యారంట. 
  • తీవ్రమైన అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో 75 రోజులు పోరాడి 2016, డిసెంబర్ 5న జయ స్వర్గస్తులయ్యారు.    
  
                                      

             

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

తెలుగు సినిమా పుట్టిన రోజు నేడు!



మొదటి సినిమా ప్రచార పత్రం 
సినిమాకి పుట్టిన రోజు అంటే విడుదలైన రోజు అని అర్థం. తెలుగు సినిమాకి నేటితో 85 ఏళ్ళు పూర్తయ్యాయి. తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే 1932 ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైంది. అయితే దీనితో ఏకీభవించని వాళ్ళూ ఉన్నారు. వారి లెక్క ప్రకారం తెలుగు సినిమా పుట్టిన రోజు సెప్టెంబర్ 15, 1931. కానీ డా. రెంటాల జయదేవ అనే పాత్రికేయుడు ఇదే విషయమై నాలుగేళ్ళు పరిశోధన చేసి బోలెడన్ని విషయాలు సేకరించారు. 

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'  మొదటగా తెలుగునేలపై కాకుండా మరాఠీ గడ్డపై నాటి బొంబాయి నగరంలో కృష్ణ సినిమా థియేటర్లో విడుదలైందట. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ 1932, జనవరి 22న ఇచ్చారంట. సర్టిఫికెట్ నెంబరు కూడా సంపాదించారు. ఆ నెంబరు 11032. ఇక సినిమా నిడివి వచ్చి 9762 అడుగులు. 108 నిమిషాల ఈ పది రీళ్ళ సినిమాను కేవలం 21 రోజుల్లో నిర్మించారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన 'భక్త ప్రహ్లాద' నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ రోజుల్లో ఆ నాటకం బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల ఆ నాటకసమాజం వారిని బొంబాయి పిలిపించి, చిత్రాన్ని అక్కడి కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. దర్శకత్వం హెచ్.ఎమ్.రెడ్డి.        

తొలి తెలుగు సినీ దర్శకుడు
హెచ్ ఎమ్ రెడ్డి 
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. మన లెక్క ప్రకారం టైటిల్ రోల్ పోషించిన ఈ కుర్రాడే మన తొలి కథానాయకుడు. అప్పటికి ఆ పిల్లాడికి తొమ్మిదేళ్ళే. ఖమ్మం ప్రాంతానికి చెందిన వాడు. ఈ చిత్రానికి అతనికిచ్చిన పారితోషికం రూ.400లు. లీలావతిగా నటించిన సురభి కమలాబాయినే తొలి కథానాయికగా పేర్కొంటారు. ఆమెకు వెయ్యి రూపాయల పారితోషికం ఇచ్చారంట. ప్రహ్లాదునితో పాటు చండామార్కుల వారి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న మరో సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ నటించారు. 

'భక్త ప్రహ్లాద' చిత్రంలో ఓ దృశ్యం  
ఈ చిత్రం బొంబాయిలో రెండు వారాలు ఆడాక విజయవాడ శ్రీమారుతి సినిమా హాలులో, రాజమండ్రి శ్రీకృష్ణా సినిమాహాలులో ప్రదర్శితమైంది. ఘనవిజయం సాధించిన ఈ సినిమాలో 40 పాటలూ పద్యాలూ ఉన్నాయి. పది నెలలకు పైగా ప్రదర్శించబడిన ఈ సినిమాని చూసేందుకు నాలుగు అణాల టిక్కెట్టును నాలుగు రూపాయలకు కొనుక్కున్నారట జనం. అదీ తొలి తెలుగు సినిమా తెరవెనుక కథ. సినీ ప్రేమికులందరికీ 'తెలుగు ఫిల్మ్ డే' శుభాకాంక్షలు.         
         

4, ఫిబ్రవరి 2017, శనివారం

తెలుగు సినిమా కోసం పుట్టిన సౌరభ కమలం

జీవితమే ఒక నాటక రంగం అన్నాడు షేక్ స్పియర్. అదేమో తెలీదుకానీ సురభివాళ్లకు నాటకమే జీవనాధారం, నాటకమే జీవితం... జీవనవిధానం. అందుకే కమలాబాయికి నటనా వేదికే పురిటి మంచమైంది. 

అప్పటికి ఇంకా సినిమా గురించి ఎవరికీ తెలియదు. వినోదం కోసం నాటకాలు, కాలక్షేపం కోసం హరికథలు, బుర్రకతలు ఉండేవి. ఆ ప్రదర్శనలిచ్చే కళాకారులకు ఎంతో ఆదరణ, పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అయితే నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులే వేషం మార్చి పోషించేవారు. స్త్రీ పదిమంది ముందూ వేదిక ఎక్కడం ఆ రోజుల్లో అవమానంగా, చిన్నతనంగా భావించేవారు. కానీ సురభి నాటక సమాజం రాకతో ఆ పరిస్థితి మారింది. నాటకానికి మహిళా నటీమణులను అందించిన తొలి సంస్థ సురభి. 

కడప ప్రాంతంలో 1885లో సురభి గ్రామంలో ఆవిర్భవించడం చేత ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. వనారస గోవిందరావుగారు ఈ సంస్థ వ్యవస్థాపకులు. ప్రదర్శించిన తొలి కళాఖండం 'కీచక వధ'. అక్కడి నుండి ప్రారంభమైన సురభి ప్రస్థానం కొన్ని దశాబ్దాల పాటు కళారంగాన్ని శాసించింది. ఏదైనా ఊరికి సురభి వాళ్ళు వచ్చారంటే ఆ ప్రాంతమంతా సందడి నిండేది. రంగస్థలంపై పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ, సందర్భోచితంగా వచ్చే సంఘటనలను ట్రిక్ వర్క్స్ తో అత్యంత సహజంగా స్టేజీపై చూపి ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం సురభి ప్రత్యేకత. హరిశ్చంద్ర నాటకం వేస్తే కాటి సీనులో వేదికపై చితిమంటలు ఎంతో సహజంగా కనిపించేవి. 

సురభి సంస్థలోని వారంతా ఏ వేషమైనా వేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. తమకు తామే మేకప్ చేసుకునేవారు. రంగస్థలంపై తెరలు కట్టడం నుంచి పాడడం, హార్మోనియం వాయించడం వరకు అందరూ అన్నిపనులను చూసుకోగల సమర్థులు. ఏడాది పొడుగునా దేశం మీద తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ రకంగా నాటకమే వారి జీవన విధానం అయ్యింది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నాటకమే శ్వాసగా జీవించేవారు. అలాంటి సురభి నాట్య మండలిలో నటనకి, గాత్రానికి పేరుబడ్డ నటి వెంకుబాయి. ఆమె భర్త కృష్ణాజీరావు.   

కమలాబాయి జననం: 

1907వ సంవత్సరంలో ఒక రోజు. నాటకంలో దమయంతి పాత్ర పోషిస్తోంది వెంకుబాయి. ఉన్నట్టుండి ఏదో కలకలం. ప్రేక్షకులకు మాత్రం ఏమీ తెలియట్లేదు. అలా కలకలాన్ని కప్పి పుచ్చుతూ నాటకం కొనసాగుతూనే ఉంది. సీను పూర్తయ్యింది. వెంటనే తెరపడింది. మామూలుగా అయితే సురభిలో తెరపడిన క్షణాల్లో కొత్త దృశ్యం వచ్చేస్తుంది. కానీ ఆరోజు నాటకంలో కాస్త ఎక్కువసేపే విరామం ప్రకటించారు. తిరిగి తెర లేచేసరికి అప్పుడే జన్మించిన తన బిడ్డను చేతులలో పట్టుకుని వెంకుబాయి వేదికపైకి వచ్చింది. ప్రేక్షకులు ఇది కూడా నాటకంలో భాగం అనుకున్నారు. కానీ వేదిక మీదే వెంకుబాయికి పురిటి నొప్పులు వచ్చిన సంగతి, తెరదించి వేదిక మీదే పురుడు పోసిన సంగతి, పుట్టింది ఆడపిల్ల అన్న విషయాలను నిర్వాహకులు ప్రకటించాక జనం హర్షద్వానాలు చేశారు. బిడ్డకు డబ్బులు చదివించారు. ఆ బిడ్డ మరెవరో కాదు మన తెలుగు చలనచిత్ర తొలి కథానాయిక ‘సురభి కమలాబాయి’.  
కమలాబాయి మాటలు నేర్చేసరికే నాటకాల్లో బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు వేషాలు ధరించడం ప్రారంభించింది. నాట్యం, సంగీతం నేర్చుకుని ఎన్నో నాటకాలు ప్రదర్శించింది. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. ఆనాడు అందరూ మహిళలే నటించి విజయవంతమైన 'సావిత్రి' నాటకంలో సావిత్రి పాత్రను పోషించి మన్ననలు అందుకుంది కమలాబాయి. ఇదిలా ఉంటే అక్కడ బొంబాయిలో అంటే నేటి ముంబైలో...  

మొదటి టాకీ సినిమా:   

దేశంలోనే మొదటి టాకీ సినిమా 'ఆలం ఆరా' చిత్ర నిర్మాణ సమయమది. ఆ చిత్ర దర్శక నిర్మాత 'అర్దేశిర్ ఇరానీ' దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక తెలుగువ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. అప్పటికే కొన్ని మూకీ సినిమాలు తీసిన అనుభవం దాయనకు. ఆలం ఆరా నిర్మాణమప్పుడే సరిగ్గా ఇలాంటి టాకీ సినిమా తెలుగులో కూడా తీయాలని ఆయన భావింఛాడు. 
కానీ ఏ కథ మీద చేయాలి, ఎవరితో చేయాలి అని ఆలోచించగా ఆయన మదిలో మెరిసింది సురభి సంస్థ. అప్పటి సమాజంలో పౌరాణిక నాటకాకు మంచి ఆదరణ ఉండేది. మూకీ సినిమాలు ఉన్నప్పటికీ నాటకానికే మొగ్గు చూపేవారు ప్రజలు. అలాంటి సమయంలో టాకీ సినిమా తీయాలంటే, ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షించాలంటే పాపులర్ నాటకాన్నే తెరకెక్కించాలి. అందుకే భక్త ప్రహ్లాదుని వైపు మొగ్గారు హెచ్.ఎం.రెడ్డి.

అప్పటికి 19 భక్త ప్రహ్లాద నాటకాలు చలామణీలో ఉన్నప్పటికీ ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం మంచి  జనాదరణ పొంది ఉంది. ఈ నాటకంతోనే తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాలని హెచ్.ఎం.రెడ్డి నిర్ణయించుకున్నారు. సురభి నాటక సమాజం వారికి ఈ నాటకం కొట్టిన పిండి. వాళ్లని కలిసి ఈ నాటకాన్ని సినిమాగా మలుస్తానని అన్నారు హెచ్.ఎం.రెడ్డి. సహజంగానే వాళ్లు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే 'సినిమా' పేరిట ఒక మహా వినోద విప్లవం మొదలు కాబోతోందని వారికప్పుడు తెలీదు. చివరికి నటుడు సీఎస్సార్ ఆంజనేయులు సిఫారసుతో, సహకారంతో వాళ్లను బతిమాలి ఎట్టకేలకు సురభి ట్రూపు మొత్తాన్నీ బొంబాయి తీసుకువెళ్లారు.

తొలి తెలుగు చలనచిత్ర కథానాయిక: 

ఇంపీరియల్ స్టూడియోలో షూటింగ్. లీలావతి పాత్రధారి కమలాబాయిపై ఫస్ట్ షాట్ తీశారు. అప్పటికి కమలాబాయికి 18 ఏళ్ళు మాత్రమే. పారితోషికం 500 రూపాయలకు మాట్లాడుకున్నారు. కానీ తర్వాత వెయ్యినూట పదహార్లు, రైలు ఖర్చులు ఇచ్చి పంపించారు. హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, ప్రహ్లాదునిగా మాస్టర్ కృష్ణాజీరావు నటించారు. తరువాతికాలంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎల్ వి ప్రసాద్ కూడా ఇందులో నటించారు. రోజుకి దాదాపు 20 గంటలు షూటింగ్ చేసేవారు. నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి. కృష్ణా మూవీస్ బ్యానరుపై  21 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. అలా దేశంలో రెండో టాకీ, తెలుగులో మొదటి టాకీ రూపొందింది. ఈ చిత్రం పది నెలల పాటు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఎక్కువ నిడివిగల పాత్రలో నటించారు కనక కమలాబాయినే తొలి తెలుగు హీరోయిన్ గా పరిగణిస్తారు. 

కమలాబాయి సినీ ప్రస్థానం: 

కమలాబాయి ప్రతిభ గురించి విన్న సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. అక్కడే దాదాపు పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించారు. 1940లోకి వచ్చేసరికి అప్పటివరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించారు. 1931 నుంచి 1961 వరకు  మూడు దశాబ్దాలపాటు ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’, 'సావిత్రి', 'పృథ్విపుత్ర' వంటి 20 చిత్రాల్లో ఆమె నటించారు. విజయావారి ‘పాతాళభైరవి’ (1951)లో ఎన్టీఆర్ తల్లిగా నటించింది కమలాబాయే. 'దేవదాసు', 'మల్లీశ్వరి' వంటి చిత్రాల్లో కూడా  నటించిన కమలాబాయి చివరిచిత్రం 1961లో వచ్చిన 'వాగ్దానం'. 

తొలి తెలుగు మహిళా దర్శకురాలు:  

కమలాబాయినే తొలి తెలుగు మహిళా దర్శకురాలు అని కూడా అంటారు. ఇందుకు నిదర్శనంగా ఒక సంఘటనను ఉదహరిస్తారు.      

సాగర్ ఫిల్మ్ సంస్థ వారి సినిమాల్లో పదేళ్లు నటించిన కమలాబాయి 1939లో విడుదలైన భక్తజయదేవ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాబాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ అతను దర్శకుడు. ఆయనకు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో చిత్ర నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చిందని, నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరిస్తున్న కమలాబాయి బాధ్యత తీసుకుని నటనతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తిచేసిందంటారు.  అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది. 

ఆఖరుదశలో ఆర్థిక ఇబ్బందులు: 

కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ముప్ఫై వేల రూపాయలను భవిష్యత్తు అవసరాలకై ఒక బ్యాంకులో డిపాజిట్టు చేయగా, ఆ బ్యాంకు దివాళా తీసింది. దాంతో చేతిలో డబ్బులేక, నటనావకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.  వయసు మీదపడి సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా ఇంట్లో ఊరకే కూర్చోలేక తన అక్క కూతురైన సురభి బాలసరస్వతితో పాటు షూటింగులకు వెళుతుండేవారు. పరిశ్రమ ఆమెను వదిలేసినా డబ్బు కష్టాలు ఆమెను చివరివరకూ వీడలేదు. వాటిని వదిలించుకోలేని పరిస్థితుల్లో 1971లో మరణించారు. తెలుగు సినీ కళామతల్లిని తొలిగా పరిచయం చేసుకుని తెలుగు వారింటికి ఆహ్వానించిన 'అభినయ సౌందర్యం' కమలాబాయి స్మృతికి నివాళి అర్పిద్దాం.