4, ఫిబ్రవరి 2017, శనివారం

తెలుగు సినిమా కోసం పుట్టిన సౌరభ కమలం

జీవితమే ఒక నాటక రంగం అన్నాడు షేక్ స్పియర్. అదేమో తెలీదుకానీ సురభివాళ్లకు నాటకమే జీవనాధారం, నాటకమే జీవితం... జీవనవిధానం. అందుకే కమలాబాయికి నటనా వేదికే పురిటి మంచమైంది. 

అప్పటికి ఇంకా సినిమా గురించి ఎవరికీ తెలియదు. వినోదం కోసం నాటకాలు, కాలక్షేపం కోసం హరికథలు, బుర్రకతలు ఉండేవి. ఆ ప్రదర్శనలిచ్చే కళాకారులకు ఎంతో ఆదరణ, పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అయితే నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులే వేషం మార్చి పోషించేవారు. స్త్రీ పదిమంది ముందూ వేదిక ఎక్కడం ఆ రోజుల్లో అవమానంగా, చిన్నతనంగా భావించేవారు. కానీ సురభి నాటక సమాజం రాకతో ఆ పరిస్థితి మారింది. నాటకానికి మహిళా నటీమణులను అందించిన తొలి సంస్థ సురభి. 

కడప ప్రాంతంలో 1885లో సురభి గ్రామంలో ఆవిర్భవించడం చేత ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. వనారస గోవిందరావుగారు ఈ సంస్థ వ్యవస్థాపకులు. ప్రదర్శించిన తొలి కళాఖండం 'కీచక వధ'. అక్కడి నుండి ప్రారంభమైన సురభి ప్రస్థానం కొన్ని దశాబ్దాల పాటు కళారంగాన్ని శాసించింది. ఏదైనా ఊరికి సురభి వాళ్ళు వచ్చారంటే ఆ ప్రాంతమంతా సందడి నిండేది. రంగస్థలంపై పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ, సందర్భోచితంగా వచ్చే సంఘటనలను ట్రిక్ వర్క్స్ తో అత్యంత సహజంగా స్టేజీపై చూపి ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం సురభి ప్రత్యేకత. హరిశ్చంద్ర నాటకం వేస్తే కాటి సీనులో వేదికపై చితిమంటలు ఎంతో సహజంగా కనిపించేవి. 

సురభి సంస్థలోని వారంతా ఏ వేషమైనా వేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. తమకు తామే మేకప్ చేసుకునేవారు. రంగస్థలంపై తెరలు కట్టడం నుంచి పాడడం, హార్మోనియం వాయించడం వరకు అందరూ అన్నిపనులను చూసుకోగల సమర్థులు. ఏడాది పొడుగునా దేశం మీద తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ రకంగా నాటకమే వారి జీవన విధానం అయ్యింది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నాటకమే శ్వాసగా జీవించేవారు. అలాంటి సురభి నాట్య మండలిలో నటనకి, గాత్రానికి పేరుబడ్డ నటి వెంకుబాయి. ఆమె భర్త కృష్ణాజీరావు.   

కమలాబాయి జననం: 

1907వ సంవత్సరంలో ఒక రోజు. నాటకంలో దమయంతి పాత్ర పోషిస్తోంది వెంకుబాయి. ఉన్నట్టుండి ఏదో కలకలం. ప్రేక్షకులకు మాత్రం ఏమీ తెలియట్లేదు. అలా కలకలాన్ని కప్పి పుచ్చుతూ నాటకం కొనసాగుతూనే ఉంది. సీను పూర్తయ్యింది. వెంటనే తెరపడింది. మామూలుగా అయితే సురభిలో తెరపడిన క్షణాల్లో కొత్త దృశ్యం వచ్చేస్తుంది. కానీ ఆరోజు నాటకంలో కాస్త ఎక్కువసేపే విరామం ప్రకటించారు. తిరిగి తెర లేచేసరికి అప్పుడే జన్మించిన తన బిడ్డను చేతులలో పట్టుకుని వెంకుబాయి వేదికపైకి వచ్చింది. ప్రేక్షకులు ఇది కూడా నాటకంలో భాగం అనుకున్నారు. కానీ వేదిక మీదే వెంకుబాయికి పురిటి నొప్పులు వచ్చిన సంగతి, తెరదించి వేదిక మీదే పురుడు పోసిన సంగతి, పుట్టింది ఆడపిల్ల అన్న విషయాలను నిర్వాహకులు ప్రకటించాక జనం హర్షద్వానాలు చేశారు. బిడ్డకు డబ్బులు చదివించారు. ఆ బిడ్డ మరెవరో కాదు మన తెలుగు చలనచిత్ర తొలి కథానాయిక ‘సురభి కమలాబాయి’.  
కమలాబాయి మాటలు నేర్చేసరికే నాటకాల్లో బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు వేషాలు ధరించడం ప్రారంభించింది. నాట్యం, సంగీతం నేర్చుకుని ఎన్నో నాటకాలు ప్రదర్శించింది. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. ఆనాడు అందరూ మహిళలే నటించి విజయవంతమైన 'సావిత్రి' నాటకంలో సావిత్రి పాత్రను పోషించి మన్ననలు అందుకుంది కమలాబాయి. ఇదిలా ఉంటే అక్కడ బొంబాయిలో అంటే నేటి ముంబైలో...  

మొదటి టాకీ సినిమా:   

దేశంలోనే మొదటి టాకీ సినిమా 'ఆలం ఆరా' చిత్ర నిర్మాణ సమయమది. ఆ చిత్ర దర్శక నిర్మాత 'అర్దేశిర్ ఇరానీ' దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక తెలుగువ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. అప్పటికే కొన్ని మూకీ సినిమాలు తీసిన అనుభవం దాయనకు. ఆలం ఆరా నిర్మాణమప్పుడే సరిగ్గా ఇలాంటి టాకీ సినిమా తెలుగులో కూడా తీయాలని ఆయన భావింఛాడు. 
కానీ ఏ కథ మీద చేయాలి, ఎవరితో చేయాలి అని ఆలోచించగా ఆయన మదిలో మెరిసింది సురభి సంస్థ. అప్పటి సమాజంలో పౌరాణిక నాటకాకు మంచి ఆదరణ ఉండేది. మూకీ సినిమాలు ఉన్నప్పటికీ నాటకానికే మొగ్గు చూపేవారు ప్రజలు. అలాంటి సమయంలో టాకీ సినిమా తీయాలంటే, ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షించాలంటే పాపులర్ నాటకాన్నే తెరకెక్కించాలి. అందుకే భక్త ప్రహ్లాదుని వైపు మొగ్గారు హెచ్.ఎం.రెడ్డి.

అప్పటికి 19 భక్త ప్రహ్లాద నాటకాలు చలామణీలో ఉన్నప్పటికీ ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం మంచి  జనాదరణ పొంది ఉంది. ఈ నాటకంతోనే తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాలని హెచ్.ఎం.రెడ్డి నిర్ణయించుకున్నారు. సురభి నాటక సమాజం వారికి ఈ నాటకం కొట్టిన పిండి. వాళ్లని కలిసి ఈ నాటకాన్ని సినిమాగా మలుస్తానని అన్నారు హెచ్.ఎం.రెడ్డి. సహజంగానే వాళ్లు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే 'సినిమా' పేరిట ఒక మహా వినోద విప్లవం మొదలు కాబోతోందని వారికప్పుడు తెలీదు. చివరికి నటుడు సీఎస్సార్ ఆంజనేయులు సిఫారసుతో, సహకారంతో వాళ్లను బతిమాలి ఎట్టకేలకు సురభి ట్రూపు మొత్తాన్నీ బొంబాయి తీసుకువెళ్లారు.

తొలి తెలుగు చలనచిత్ర కథానాయిక: 

ఇంపీరియల్ స్టూడియోలో షూటింగ్. లీలావతి పాత్రధారి కమలాబాయిపై ఫస్ట్ షాట్ తీశారు. అప్పటికి కమలాబాయికి 18 ఏళ్ళు మాత్రమే. పారితోషికం 500 రూపాయలకు మాట్లాడుకున్నారు. కానీ తర్వాత వెయ్యినూట పదహార్లు, రైలు ఖర్చులు ఇచ్చి పంపించారు. హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, ప్రహ్లాదునిగా మాస్టర్ కృష్ణాజీరావు నటించారు. తరువాతికాలంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎల్ వి ప్రసాద్ కూడా ఇందులో నటించారు. రోజుకి దాదాపు 20 గంటలు షూటింగ్ చేసేవారు. నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి. కృష్ణా మూవీస్ బ్యానరుపై  21 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. అలా దేశంలో రెండో టాకీ, తెలుగులో మొదటి టాకీ రూపొందింది. ఈ చిత్రం పది నెలల పాటు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఎక్కువ నిడివిగల పాత్రలో నటించారు కనక కమలాబాయినే తొలి తెలుగు హీరోయిన్ గా పరిగణిస్తారు. 

కమలాబాయి సినీ ప్రస్థానం: 

కమలాబాయి ప్రతిభ గురించి విన్న సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. అక్కడే దాదాపు పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించారు. 1940లోకి వచ్చేసరికి అప్పటివరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించారు. 1931 నుంచి 1961 వరకు  మూడు దశాబ్దాలపాటు ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’, 'సావిత్రి', 'పృథ్విపుత్ర' వంటి 20 చిత్రాల్లో ఆమె నటించారు. విజయావారి ‘పాతాళభైరవి’ (1951)లో ఎన్టీఆర్ తల్లిగా నటించింది కమలాబాయే. 'దేవదాసు', 'మల్లీశ్వరి' వంటి చిత్రాల్లో కూడా  నటించిన కమలాబాయి చివరిచిత్రం 1961లో వచ్చిన 'వాగ్దానం'. 

తొలి తెలుగు మహిళా దర్శకురాలు:  

కమలాబాయినే తొలి తెలుగు మహిళా దర్శకురాలు అని కూడా అంటారు. ఇందుకు నిదర్శనంగా ఒక సంఘటనను ఉదహరిస్తారు.      

సాగర్ ఫిల్మ్ సంస్థ వారి సినిమాల్లో పదేళ్లు నటించిన కమలాబాయి 1939లో విడుదలైన భక్తజయదేవ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాబాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ అతను దర్శకుడు. ఆయనకు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో చిత్ర నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చిందని, నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరిస్తున్న కమలాబాయి బాధ్యత తీసుకుని నటనతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తిచేసిందంటారు.  అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది. 

ఆఖరుదశలో ఆర్థిక ఇబ్బందులు: 

కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ముప్ఫై వేల రూపాయలను భవిష్యత్తు అవసరాలకై ఒక బ్యాంకులో డిపాజిట్టు చేయగా, ఆ బ్యాంకు దివాళా తీసింది. దాంతో చేతిలో డబ్బులేక, నటనావకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.  వయసు మీదపడి సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా ఇంట్లో ఊరకే కూర్చోలేక తన అక్క కూతురైన సురభి బాలసరస్వతితో పాటు షూటింగులకు వెళుతుండేవారు. పరిశ్రమ ఆమెను వదిలేసినా డబ్బు కష్టాలు ఆమెను చివరివరకూ వీడలేదు. వాటిని వదిలించుకోలేని పరిస్థితుల్లో 1971లో మరణించారు. తెలుగు సినీ కళామతల్లిని తొలిగా పరిచయం చేసుకుని తెలుగు వారింటికి ఆహ్వానించిన 'అభినయ సౌందర్యం' కమలాబాయి స్మృతికి నివాళి అర్పిద్దాం.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి