తొలి కథానాయిక

తొలి తెలుగు చలనచిత్ర కథానాయిక ఎవరు అన్నది మాట్లాడుకునే ముందు అసలు తెలుగు సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి కాస్త చెప్పుకోవాలి.   

తొలి తెలుగు నిశ్శబ్ద చలన చిత్రం: 


1921లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో 'భీష్మ ప్రతిజ్ఞ' అనే నిశ్శబ్ద చలన చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఈ సినిమాలో 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్లయువతి గంగాదేవి పాత్రను ధరించింది. దీన్నిబట్టి చూస్తే మన తెలుగు సినిమాకు మొదటి నటి ఈమే అని చెప్పాలి. అయితే నిశ్శబ్ద చలన చిత్రంలో సంభాషణలు ఉండవు కాబట్టి భాషా పరంగా మాట్లాడలేం. అది కాకుండా ఒక ఆంగ్ల నటిని తెలుగు నటిగా చెప్పలేం. 

తొలి తెలుగు టాకీ చిత్రం:


ఆ తర్వాత పదేళ్ళకు 1931లో అర్దేష్ ఇరానీ నిర్మాతగా  హిందీలో 'అలం అరా' చిత్రాన్ని తీశారు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో కూడా చిత్రాలను నిర్మించాలని అనుకున్నాడు. అప్పటికే హెచ్.ఎమ్.రెడ్డి ఇంపీరియల్‌ కంపెనీ నిర్మించిన ‘విజయకుమార్‌’, ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు నిశ్శబ్ద చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలలో ప్రఖ్యాత నటుడు రాజ్ కపూర్ తండ్రి పృద్వీరాజ్ కపూర్ నటించారు. ఆ అనుభవం ఉండటం చేత, పైగా తెలుగువాడు కావడం చేత తెలుగు, తమిళ భాషా చిత్రాల బాధ్యత హెచ్.ఎమ్.రెడ్డికి అప్పచెప్పాడు అర్దేష్ ఇరానీ. అలా తెలుగులో 'భక్త ప్రహ్లాద', తమిళంలో 'కాళిదాస' అనే టాకీ చిత్రాలు నిర్మించబడ్డాయి.  

'భక్త ప్రహ్లాద' విషయానికి వస్తే అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన 'భక్త ప్రహ్లాద' నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ రోజుల్లో ఆ నాటకం బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల ఆ నాటకసమాజం వారిని బొంబాయి పిలిపించి, చిత్రాన్ని అక్కడి కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. ఆ రకంగా తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. అయితే సినిమా విడుదల తేదీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 15, 1931న విడుదలైందని కొందరు అంటుండగా, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6వ తేదీన విడుదల అయ్యిందని మరికొందరి వాదన. మన దేశంలో 1920 నుంచే సెన్సార్ పద్దతి ఉంది. నాటి మద్రాసు, బొంబాయి, కలకత్తా, లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది), రంగూన్ (ప్రస్తుతం బర్మాలో ఉంది) నగరాలలో ముఖ్య పోలీసు అధికారులే సెన్సార్ అధికారులుగా వ్యవహరించేవారు. 

విడుదల తేదీ ఏదైనా తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' అనడంలో ఎలాంటి వివాదమూ లేదు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఈయన ఆ తర్వాతి కాలంలో దర్శక నిర్మాతగా పేరుపొందారు. అంతేకాదు మొట్టమొదటి తమిళ టాకీ 'కాళిదాసు'లో కూడా ఎల్.వి.ప్రసాద్ నటించారు. 

తెలుగు సినిమా తొలి కథానాయిక...  సురభి కమలాబాయి:


'భక్త ప్రహ్లాద' చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయినే తెలుగు సినిమా తొలి కథానాయిక అని చెప్పుకోవచ్చు. ఆ చిత్రంలో నటించినందుకు ఆమెకు నిర్మాత వెయ్యినూటపదహార్లు ఇవ్వడంతో పాటు రైలు ఖర్చులు కూడా ఇచ్చారంట. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. ఆ తర్వాత వచ్చిన రామ పాదుకా పట్టాభిషేకం, శకుంతల చిత్రాల్లో కూడా సురభి కమలాబాయి కథానాయకురాలిగా నటించారు. 
ఆమె తరవాత పి. రామతిలకం, సీనియర్ శ్రీరంజని వంటి వారు నటీమణులుగా వెలిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసారు. తన నాటకరంగానుభవంతో 1935లో ''హరిశ్చంద్ర'' తెలుగు చలన చిత్రంలో చంద్రమతిగా అడుగుపెట్టారు.   
అదే సంవత్సరం  'శ్రీకృష్ణ లీలలు' చిత్రంతో  లక్ష్మీరాజ్యం పరిచయమయ్యారు. 
చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ కృష్ణ తులాభారం' చిత్రంతో కాంచనమాల సినీ హీరోయిన్ గా తళుక్కు,మన్నారు.  
1938లో  కచదేవయాని చిత్రంతో కృష్ణవేణి,  చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'మోహినీ భస్మాసుర' చిత్రంతో పుష్పవల్లి కథానాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు.  
1940లో ఆర్. ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన 'బారిస్టర్ పార్వతీశం' చిత్రంతో జి వరలక్ష్మి , బి ఎన్ రెడ్డి తీసిన 'సుమంగళి' చిత్రంతో మాలతి కథానాయికలయ్యారు. వీరంతా తొలితరం కథానాయికలు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా నలుపు -తెలుపు నుంచి రంగులు పులుముకునేసరికే వీరిలో చాలామంది తెరమరుగయ్యారు. వీరందరి గురించి విడివిడిగా  'అభినయ సౌందర్యం' అనే ఈ బ్లాగులో రాయడం జరిగింది. వీరి అభినయం చూడాలంటే ఆయా సినిమాలు చాలావరకు అందుబాటులో లేకపోవచ్చు. అందుకే కనీసం వారి గురించి తెలుసుకోడానికి ఈ బ్లాగు చదవండి.                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి