23, ఫిబ్రవరి 2017, గురువారం

జయలలిత... ఓ దిగ్విజయ కథానాయకి

జయలలిత... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి లక్షల మందికి 'అమ్మ' అయ్యారు. ఒక ప్రఖ్యాత పార్టీకి అధినేతగా...  ఒంటి చేత్తో మహామహులను మట్టి కరిపించి, యోధుల్లాంటి పార్టీ నాయకులతో పాదపూజ చేయించుకున్న 'పురుచ్చి తలైవి' ఆమె. ప్రత్యర్థులకు సింహ స్వప్నం, మన అనుకున్న వారికి మమతలు పంచే అమ్మదనం. ఈ రోజు జయలలిత జయంతి రోజు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వచ్చిన తొలి జయంతి. అమ్మను పోగొట్టుకున్న బాధ తాలూకు కంట తడి ఆరకముందే, తమిళులందరూ ఆమెను పునః స్మరించుకోవలిసిన సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా జయలలిత స్మృతికి నివాళులు అర్పిస్తోంది 'అభినయ సౌందర్యం'. 

జయలలిత ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. లేదా ఒక సినీ నటి మాత్రమే కాదు. అడుగడుగునా సమస్యలతో పోరాడుతూ, ప్రత్యర్థులతో తలపడుతూ పురుషాహంకార సమాజాన్ని ఎదిరించి, అదే అహంకారాన్ని పాదాక్రాంతం చేసుకున్న ధీర వనితా యోధురాలు జయలలిత. అయినప్పటికీ మన బ్లాగుకు సంబంధించి ఆమెను ఒక నటిగానే చూద్దాం. 

తల్లి సంధ్యతో జయలలిత 
జయలలిత అసలు పేరు కోమలవెల్లి (అమ్మమ్మ పేరు). ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మాండ్య జిల్లాలో మేల్కొటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించింది కోమలవెల్లి. అయ్యంగార్లుగా పిలువబడే తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోమలవెల్లికి రెండు సంవత్సరాల వయసులోనే తండ్రి జయరామ్ దూరమయ్యారు. దీంతో తల్లి వేదవల్లి మద్రాసుకు వచ్చేసి అప్పటికే సినిమాల్లో నటిస్తున్న తన చెల్లెలు విద్యావతి (అసలుపేరు అంబుజ వల్లి)తో కలిసి తానూ నటించడం మొదలుపెట్టింది. సంధ్య పేరుతో ప్రసిద్ధి పొందింది. కోమలవెల్లిని స్కూల్లో చేర్చేటప్పుడు ఆమె పేరును జయలలితగా మార్చారు. పిన్ని వద్దే బెంగళూరులో ఉంటూ తన తల్లిని కేవలం వేసవి సెలవుల్లోనే చూసేది జయలలిత. ఆ తర్వాత కొన్నాళ్ళకు పిన్నికి వివాహం కావడంతో తాను కూడా మద్రాసు వచ్చేసి అమ్మ సంధ్యతో పాటు ఉండేది. 
పువ్వు పుట్టగానే వికసిస్తుందన్న నానుడి జయలలితకు చక్కగా వర్తిస్తుంది. జయలలిత నాలుగేండ్ల వయసులోనే కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. దాంతో పాటు వెస్ట్రన్‌ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. వీటితోపాటు భరతనాట్యం, మోహినీ ఆట్టం, కథక్‌, మణిపురి వంటి నాట్యరూపాల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1960లో మైలాపూర్‌లో జరిగిన ఓ సభలో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ సభకు నటుడు శివాజీగణేషన్‌ రావడం ఓ విశేషమైతే, జయలలిత నృత్య ప్రదర్శన చూసి భవిష్యత్‌లో పెద్ద నటి అవుతావని ప్రశంసించటం మరో విశేషం.  

అమ్మ సంధ్యతోపాటు రోజూ షూటింగ్స్‌కి వెళ్తున్న క్రమంలో ఓ రోజు మరో చైల్డ్ ఆర్టిస్ట్‌ రాకపోవడంతో జయలలితకు అవకాశం వచ్చింది. అలా 1961లో 'శ్రీశైల మహత్యం' అనే కన్నడ సినిమాలో పార్వతీదేవిగా తొలిసారి వెండితెరపై కనిపించారు. చదువులో రాణిస్తున్న జయలలితను సినీరంగానికి తేవడం ఆమె తల్లికి ఇష్టం లేదు. అయితే ఒకప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి తనయుడు శంకర్ గిరి అడగడంతో 'ది ఎపిస్టైల్‌' అనే ఆంగ్ల సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. అదికూడా ఆదివారాల్లో షూటింగ్ పెట్టుకునే ఒప్పందంతో. జయ బాగా చదువుకుని పైకి రావాలని తల్లిగా సంధ్య ఆశపడ్డారు. జయకు కూడా లాయర్ కావాలని ఉండేది. కానీ విధి మరోలా రాసింది. 

హీరోయిన్ గా కన్నడ చిత్రం: 

సంధ్య నటించిన 'కర్ణన్' తమిళ చిత్రం తాలూకు ఒక కార్యక్రమంలో తల్లితో పాటు వచ్చిన జయను చూశాడు ప్రముఖ దర్శక నిర్మాత బిఆర్ పంతులు. అప్పుడాయన 'చిన్నాడ గొంబె' అనే కన్నడ సినిమాకు కథానాయిక కోసం వెదుకుతున్నాడు. వెంటనే సంధ్య దగ్గరికి వెళ్ళి జయ గురించి అడిగారు. సంధ్య మొహమాట పడింది. చదువుకు ఏ మాత్రం భంగం కలగకుండా కేవలం రెండునెలల్లోనే షూటింగ్ ముగించాలని షరతు పెట్టింది. అప్పుడు పియుసి చదువుతున్నారు జయ. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కథానాయికగా తన తొలి చిత్రానికి జయ అందుకున్న పారితోషికం రూ.3,000లు. 

తమిళ, తెలుగు రంగాల్లో ప్రవేశం: 

తల్లిచాటు బిడ్డగా జయ 
తొలి చిత్రం విజయవంతం కావడం, అదే సమయంలో తల్లి సంధ్యకు అవకాశాలు తగ్గి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత తన మీద పడటంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది జయ. 1965లో 'వెన్నిరా ఆడై' అనే చిత్రంతో అటు తమిళ రంగానికి, 'మనుషులు -మమతలు' చిత్రంతో ఇటు తెలుగు సినీ రంగానికి ఒకేసారి పరిచయమయ్యారు జయ. ఈ రెండు చిత్రాలు కూడా విజయవంతం కావడంతో జయ పేరు పరిశ్రమలో మారుమ్రోగి పోయింది. పదహారేళ్ళకే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు జయలలిత. 1966లో జయ నటించిన 11 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కురిపించాయి. దాంతో 1967లో పోయస్ గార్డెన్ లో ఉన్న 'వేద నిలయం' భవనాన్ని లక్షా 32 వేలకు కొన్నారు జయ. తన తల్లి పేరును పెట్టుకున్న 'వేద నిలయం' అంటే ఆమెకు ఎంతో ఇష్టం. 

హిందీ చిత్రం 'ఇజ్జత్':  

హిందీ చిత్రంలో ఓ స్టిల్ 
జయలలిత హిందీలో మాత్రం ఒకే ఒక్క సినిమా చేశారు. తెలుగు - తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన అలనాటి మేటి దర్శకుడు టి.ప్రకాశరావు దర్శకత్వంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర నటించిన 'ఇజ్జత్‌' సినిమాలో జయలలిత నటించారు.  ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా అందులో నటించిన జయలలితకు నటిగా మంచి పేరు వచ్చింది. 1973లో 'జీసెస్‌' చిత్రంతో జయ మాలీవుడ్‌లోకి అడుగిడారు. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో అతి తక్కువ కాలంలోనే జయ మాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తొలి గ్లామర్ హీరోయిన్:  

తెలుగు చిత్రం 'మనుషులు మమతలు'లో జయ 
హీరోయిన్‌లు నిండుగా చీరలో మాత్రమే కనిపించే ఆ కాలంలో జయ చొరవ చూపి స్కర్ట్స్‌, షార్ట్‌ స్లీవ్స్‌, టైట్‌ పాంట్స్‌తో నటించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. హీరోయిన్ కు స్విమ్ సూట్ కూడా ఆమే తొడిగారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఏర్పర్చుకున్నారు. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 140 సినిమాల్లో నటించగా, వాటిల్లో 119 సినిమాలు విజయం సాధించడం విశేషం.

ఎమ్జీఆర్‌తో జోడీ: 

'ఆయిరత్తిల్ ఒరువన్' నుండి ఓ స్టిల్  
1965-1973 కాలంలో ఎమ్జీఆర్‌తో కలిసి జయ ఎక్కువ సినిమాల్లో నటించింది. 'ఆయిరత్తిల్‌ ఒరవన్‌' చిత్రం ఎమ్జీఆర్‌తో కలిసి నటించిన తొలి చిత్రం. ఇది అద్భుత విజయాన్ని సాధించింది. ఆయనతో నటించిన చివరి చిత్రం 'పట్టికాట్టు పొన్నయ్య'. ఈ చిత్రం 1973లో తెరపైకి వచ్చింది. ఎమ్జీఆర్‌తో కలిసి నటించిన 28 సినిమాలూ బాక్సాఫీస్‌ హిట్స్‌ అవ్వడం విశేషం. ఆయనే జయకు రాజకీయ విద్య నేర్పించారు. ఎమ్జీఆర్‌ ను జయలలిత గురువుగా భావించారు. 'ఆయిరతిల్‌ ఒరువన్‌' చిత్రాన్ని ఎన్నికల సమయంలో డిజిటలైజేషన్‌ చేసి విడుదల చేయగా, ఇది తమిళనాట సంచలనం సృష్టించింది. జయ గెలుపులో ఈ సినిమా కీలక పాత్ర పోషించిందని అంటారు. వారిద్దరి జోడీకి తమిళనాట అంత ఆదరణ ఉండబట్టే జయను ఎమ్జీఆర్‌ రాజకీయ వారసురాలిగా అంగీకరించాయి తమిళ రాజకీయాలు.  

జయ తెలుగు చిత్రాలు:  

తమిళంలో ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎస్‌ఎస్‌. రాజేంద్రన్, జయశంకర్, ఏవీఎం.రాజన్, ముత్తురామన్, శివకుమార్ వంటి నటులందరితో నటించిన జయ తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులతోనూ చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌, జయలలిత నటించిన 'కదలడు వదలడు' చిత్రంలో అప్పట్లో భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్‌తో కలిసి దాదాపు 12 చిత్రాల్లో ఆమె నటించారు. 'గోపాలుడు-భూపాలుడు', 'చిక్కడు-దొరకడు', 'తిక్క శంకరయ్య', 'నిలువు దోపిడి', 'బాగ్దాద్‌ గజదొంగ', 'కథానాయకుడు', 'కదలడు- వదలడు', 'గండికోట రహస్యం', 'ఆలీబాబా 40 దొంగలు', 'శ్రీ కృష్ణ విజయం', 'శ్రీ కృష్ణ సత్య', 'దేవుడు చేసిన మనుషులు' వంటి తదితర చిత్రాలతో ఎన్టీఆర్‌, జయలలిత హిట్‌ పెయిర్‌గా నిలిచారు. వీటిల్లో చాలా చిత్రాలు సిల్వర్‌జూబ్లీలు ఆడాయంటే అతిశయోక్తి లేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఏడు చిత్రాల్లో నటించారు. 'మనుషులు-మమతలు', 'ఆస్తిపరులు', 'బ్రహ్మచారి', 'ఆదర్శ కుటుంబం', 'అదృష్టవంతులు', 'భార్యాబిడ్డలు', 'నాయకుడు వినాయకుడు' వంటి తదితర చిత్రాలతో ఈ జోడీ సైతం హిట్‌ పెయిర్‌ అయిపించుకుంది. ఇక శోభన్ బాబుతో 'డాక్టర్ బాబు', కృష్ణతో 'గూఢచారి 116', కాంతారావుతో 'చిక్కడు -దొరకడు' చిత్రాల్లో నటించారు. వాటిని నిత్యం స్మరించుకునేలా ఎన్నో మధురగీతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.  ‘మొక్క జొన్న తోటలో మురిసిన సీకట్లలో..’, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’, ‘ఆకులు పోకలు ఇవ్వొద్దు.. నా నోరు ఎర్రగ చేయొద్దు..’, ‘నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..’, ‘విరిసే కన్నులలో వేయి భాషలున్నవిలే..’, ‘ముత్యాల జల్లు కురిసే..’, ‘వినవయ్యా రామయ్యా..’, ‘బిడియమేల ఓ చెలి..’, ‘పగటిపూట చంద్రబింబం..’  వంటి ఎన్నో మధురగీతాలలో తన అభినయం, సౌందర్యంతో ఆ పాటలకు వన్నె తీసుకొచ్చారు. తెలుగు ప్రేక్షకుల మదిలో అందాల తారగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

గాయనిగా జయలలిత: 

జయ మంచి గాయని అన్న విషయం చాలామందికి తెలియదు. చిన్నప్పుడే సంగీతాన్ని నేర్చుకున్న జయ గాత్రం బాగుండటంతో నిర్మాతలు ఆమెతో పాటలు పాడించారు. ఎన్టీఆర్‌తో నటించిన 'అలీబాబా 40 దొంగలు' చిత్రంలో 'చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె' అనే పాట పాడారు.  'అమ్మ ఎండ్రాల్‌ అన్బు..'(అదిమై పెన్న్‌), 'ఓ మేరి దిల్‌రుబ..'(సూర్యకాంతి), 'నాన్‌ ఎండ్రాల్‌ అదు..'(సూర్యకాంతి), 'కాంగలిల్‌ ఆయిరామ్‌..'(వందలె మగరాసి)వంటి తమిళ పాటలు పాడి గాయనిగా కూడా పాపులర్‌ అయ్యారు. దీంతోపాటు భక్తి గీతాలు, ఇతర ఆల్బమ్స్‌లో కూడా జయలలిత పాటలు పాడడం విశేషం. కె.వి. మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, కున్నకుడి వైద్యనాధన్‌ వంటి సంగీత దర్శకుల సారథ్యంలోనే ఎక్కువ పాటలు పాడారు. ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మూడు పాటలు పాడారు. 

'కళైమామణి' జయ:  

ఐదుసార్లు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్‌ అవార్డులు అందుకున్నారు జయ. 1971లో తంగగోపురం, 72లో రామన్‌తేడియసీతై, 73లో సూర్యకాంతి, 74లో తిరుమాంగల్యం, 75లోయారుక్కుం వెక్కమ్‌ ఇల్లై చిత్రాలకు వరుసగా తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డుల పురష్కారాన్ని అందుకున్న అరుదైన నటి జయలలిత.  అదేవిధంగా 1972లో తమిళనాడు ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం 'కలైమామణి' అవార్డు జయలలితను వరించింది. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. 

ఇతర విషయాలు:  




  • జయ జీవితంలో ఆమె ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదనే చెప్పాలి. ఆమె బాగా చదివి న్యాయవాది కావాలని ఆశించారు. తన ప్రమేయం లేకుండానే 16వ ఏట సినీ రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇంకా విచిత్రంగా రాజకీయాల్లోకి కూడా అనుకోకుండానే వచ్చేశారు. తరువాత అదే జీవితంగా మార్చుకోవాల్సి వచ్చింది. 
  • అమెకు క్రికెట్‌ అన్నా, మేటి క్రికెటర్‌ పటౌడీ అన్నా వీరాభిమానం. అమెరికన్‌ నటుడు రాక్‌ హడ్సన్‌ అన్నా కూడా. వారిద్దరి బొమ్మలను చిన్నప్పుడు జయలలిత చాలా సేకరించారట. 
  • చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జయలలితపై దాదాపు 16 కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడిచాయి. 
  • జయలలితకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. అందులోనూ పురాణగాథలంటే మరీ ఇష్టం. ఆంగ్లంలోనూ, తమిళంలోనే కాకుండా ఇతర భాషల పుస్తకాలు కూడా ఆంగ్ల అనువాదాలు తెప్పించుకుని చదివేవారామె. సినీ నటిగా ఉన్నప్పటినుంచీ ఆమెకు ప్రయాణాల్లో, విదేశీ పర్యటనలకి వెళ్లేటప్పుడు పుస్తకాలు వెంట తీసుకెళ్లడం అలవాటు. చదవడమే కాదు, జీవితంలో వివిధ సందర్భాల్లో తాను చదివినవి గుర్తు చేసుకుంటూ ఉండేవారు. 
  • అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది.  ఏటా జనవరి నెలలో భాగ్యనగరానికి వస్తుండేవారు. మారేడ్‌పల్లిలో ఆమెకు సమీప బంధువులు ఉన్నారంట. 
  • 1965కు ముందు పలు తెలుగు చలనచిత్రాల్లో నటించడానికి నగర శివారు ప్రాంతమైన జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాలకు వచ్చేవారు. ఆ సమయంలోనే జీడిమెట్లలో నాలుగెకరాలు, పేట్‌బషీరాబాద్‌లో ఏడెకరాలు కొనుగోలు చేసి జె.జె.గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహారీగోడ నిర్మించారు. 
  • జయలలిత సినీరంగంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు శ్రీనగర్‌కాలనీలో ఒక ఇల్లు కొన్నారు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇక్కడకు వచ్చిన సందర్భాల్లో తనసొంతింట్లో ఉండేవారు. తర్వాత రాజకీయాల్లో చేరడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడకు రావడం మానేశారు.
  • జయ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు సభలో జయ ప్రసంగానికి నాటి నాయకురాలు ఇందిరాగాంధీ ముగ్దులయ్యారంట. 
  • తీవ్రమైన అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో 75 రోజులు పోరాడి 2016, డిసెంబర్ 5న జయ స్వర్గస్తులయ్యారు.    
  
                                      

             

1 కామెంట్‌:

  1. hero heroine abhinaya sowdaryam choodandi
    కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

    రిప్లయితొలగించండి